ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రచారానికే పరిమితమైన దిశ.. ఫిర్యాదులపై స్పందన కరవు - ap latest news

రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఆర్భాటపు ప్రచారాలు. బటన్ నొక్కగానే పోలీసులు క్షణాల్లో మీ ముందు ఉంటారనే ప్రకటనలు. ఈ గొప్పల మాటెలా ఉన్నా... రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. గుంటూరులో బాలికపై దాడి మొదలుకుని రెండు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారం వరకు జరిగిన ఘటనలు చూస్తే... మహిళల భద్రతకు భరోసా లేదనే విషయం తేటతెల్లమవుతోంది.

Disha
Disha

By

Published : Apr 23, 2022, 4:57 AM IST

బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చకుండానే.. ‘దిశ’ చట్టం చేసేశామని దాని కింద శిక్షలు కూడా పడ్డాయని పదేపదే చెప్పారు. గతంలో ఉన్న మహిళా పోలీసుస్టేషన్లకే ‘దిశ’ అంటూ పేరు మార్చి అవే కొత్తవి అన్నారు. మొబైల్‌లో ‘దిశ’ యాప్‌ ఉంటే చాలు ఆపత్కాలంలో పోలీసులు వచ్చి ఆదుకుంటారంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మొదలుకుని పోలీసు అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే బాధితులు ఫిర్యాదు ఇచ్చినప్పుడు సత్వరమే స్పందించి చర్యలు చేపట్టేలా క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేయటం, బాధితుల పట్ల వారి ప్రవర్తనలో మార్పులు తేవటంలో మాత్రం శ్రద్ధ వహించలేదు. అదే జరిగి ఉంటే విజయవాడలో తాజాగా జరిగిన సామూహిక అత్యాచారం వంటి ఘటనల్ని నిలువరించేందుకు ఆస్కారం ఉండేది.

రెండేళ్లుగా చట్టమే కాలేదు..
*మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన, లైంగిక నేరాల్లో సత్వర దర్యాప్తు, వేగవంతమైన విచారణ, కఠిన శిక్షల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది రెండేళ్లు దాటిపోయినా ఇప్పటికీ చట్టంగా మారి అమల్లోకి రాలేదు. ఈ బిల్లుల్లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973కి సవరణలు చేసినందున చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.
*బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించినా సంబంధిత మంత్రిత్వ శాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ, సమగ్ర వివరణ కోరుతూ కేంద్రం మళ్లీ మళ్లీ తిప్పి పంపిస్తోంది.
*హడావుడిగా రూపొందించటం వల్లే ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందలేకపోతున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ‘ఐపీసీ, సీఆర్‌పీసీలకు రాష్ట్రాలు చేసే సవరణలు ఆమోదించాలంటే వాటి ప్రభావం, పర్యవసానాలపై కేంద్రం ఆలోచిస్తుంది. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న బిల్లుల్ని ఆమోదించదు. దిశ బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయి. భావోద్వేగాలతో వీటిని తీసుకొచ్చారు’ అని వారు వివరిస్తున్నారు.

21 రోజుల్లో శిక్ష ఏదీ?
*2019 నవంబరు 28న హైదరాబాద్‌ శివారులో దిశ ‘హత్యా’చార ఘటన జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిశ బిల్లులు రూపొందించింది. ఈ తరహా నేరాల్లో ఏడు రోజుల్లో పోలీసుల దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయవిచారణ, 21 రోజుల్లో శిక్ష వేయించటం, సత్వర న్యాయ విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు వంటివి వాటిలో పేర్కొంది. అవి చట్టంగా మారకుండానే ఆ చట్టం కింద అనేకమంది శిక్షలు వేయించామంటూ అప్పటి హోంమంత్రి మేకతోటి సుచరిత పలుమార్లు ప్రకటించారు. సీఎం మొదలుకుని వివిధ శాఖల మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు వరకూ అనేకమంది దిశ చట్టం కింద పలు చర్యలు చేపడుతున్నామని తరచూ ప్రకటనలు చేశారు.
*చట్టమే లేకుండా ఉన్నట్లు, దాని కింద శిక్షలు వేసినట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నించటంతో అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశ బిల్లులు ఆమోదం పొందలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
*గతేడాదిలో 75 అత్యాచార ఘటనల్లో వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేశామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వాటిలో ఒక్క ఘటనలోనూ 21 రోజుల్లోగా శిక్ష పడలేదు.

ప్రత్యేక న్యాయస్థానాలేవి?
*దిశ చట్టం కింద నమోదు చేసే కేసుల సత్వర విచారణ కోసం జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక న్యాయస్థానాల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికీ ఇవి ఏర్పాటు కాలేదు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను మాత్రం ప్రభుత్వం నియమించింది.
*‘మీ మొబైల్‌లో దిశ యాప్‌ ఉంటే. మీ అన్నయ్య తోడు ఉన్నట్లే. ఆపత్కాలంలో 10-15 నిమిషాల్లో పోలీసులు వచ్చి కాపాడతారు’ అని సీఎం జగన్‌ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ‘దిశ యాప్‌’ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేయించారు. అయితే ఆపదలో ఉన్న బాధితుల కుటుంబీకులు ఎవరైనా నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా సరే పోలీసుల నుంచి సత్వర స్పందన ఉండట్లేదు. తాజాగా విజయవాడలో సామూహిక అత్యాచారం ఘటనే ఇందుకు ఉదాహరణ.

పాత వాటికే కొత్త పేరు..:గతంలో ప్రతి పోలీసు యూనిట్‌పరిధిలో ఒక మహిళా పోలీసుస్టేషన్‌ ఉండేది. వాటికే రంగులు మార్చి దిశా పేరుతో ఏర్పాటు చేశారు. దిశ గస్తీ కోసం ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒకటి చొప్పున 900 స్కూటర్లు, 163 పెట్రోలింగ్‌ వాహనాలు పంపిణీ చేశారు. దిశ యాప్‌లో గతేడాది వచ్చిన ఫిర్యాదుల్లో 7,621 చర్యలు తీసుకోదగ్గవి. వాటిలో 2,910 ఘటనల్లో పోలీసులే రాజీ కుదిర్చారు. 2,917 ఘటనల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ఇప్పించారు. 939 కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:తెదేపా అధినేత చంద్రబాబుకు.. మహిళా కమిషన్ నోటీసులు!

ABOUT THE AUTHOR

...view details