traffic issue: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రెండు బ్రిడ్జిలు నిర్మించినా సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. వంతెనలు నిర్మించిన తర్వాత గతంలో ఇక్కడున్న సిగ్నళ్లను తొలగించారు. ఆ తర్వాత సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోలేదు. దీనివల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ట్రాఫిక్ సమన్వయానికి పోలీసులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే వాహనదారులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఒక్క వరుసలోనే వాహనాలను వదులుతుండడంతో కూడలి దాటడానికి బాగా ఆలస్యమవుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టినట్లవుతోంది. ఈ పరిస్థితుల్లో సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరిస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
బెంజి సర్కిల్‌లో కొత్త హంగులతో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం రూ.15 లక్షల నుంచి 20 లక్షల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కూడలిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. కూడలికి నాలుగు వైపులా ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి వాటిపై వివిధ మార్గాల సూచికలు, వాహనదారులకు సూచనలు, వాతావరణ సమాచారం అందుబాటులో ఉంచాలని నిశ్చయించారు.