No Security in Government Hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిఘా నిద్రపోతోంది. పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించడం లేదు. మహిళా రోగులకు కనీస అవసరాలు కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో మహిళా రోగులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వ్యక్తులు మహిళా వార్డుల్లోకి ప్రవేశిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం వేల మందితో కిటకిటలాడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొద్దిమంది మాత్రమే వైద్యం కోసం వస్తారు. మిగిలిన వారు ఎందుకు వస్తారో, ఎక్కడికి వెళ్తారో గమనించే వారు లేకపోవడంతో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ, గుంటూరు తదితర ఆసుపత్రుల్లో సరైన భద్రతా సిబ్బంది లేకపోవడంతో శిశువుల అపహరణ, వస్తువుల చోరీ లాంటి ఘటనలు జరిగాయి. ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగుల వద్ద సైతం సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో రోగి ఎవరో, సిబ్బంది ఎవరో గుర్తించే పరిస్థితి లేదు. ఇటీవల విజయవాడ జీజీహెచ్‌లో జరిగిన అత్యాచార ఘటన... భద్రతా డొల్లతనానికి నిదర్శనం.
బోధనాసుపత్రుల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఉండటంతో సమన్వయం దెబ్బతింటోంది. వీరు కేవలం క్యూ వద్ద మాత్రమే ఉంటున్నారు. రోగులు, వారి బంధువులకు ఏ విభాగం ఎటు ఉందో చెప్పటానికి మాత్రమే పరిమితమవుతున్నారు.
రోగుల బంధువులు, సహాయకులకు సరైన పాసులు ఇవ్వడం లేదు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు... బయటి వారు వస్తున్నారు. వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో మహిళా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయకులు, రోగుల బంధువుల చరవాణులు, విలువైన వస్తువులు అపహరణకు గురవుతున్నాయి. బాధితులు వైద్యులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన కనిపించడం లేదు.