No salaries in AP: ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఏప్రిల్ నెల మొదటి తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీతాలను చెల్లించలేకపోయింది. సాంకేతిక సమస్యల వల్లే జీతాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పాత విధానంలో హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం చెల్లించేది. సీఎఫ్ఎంఎస్ ద్వారా రిజర్వు బ్యాంకుకు ఆ వివరాలు వెళ్లి ఉద్యోగుల ఖాతాలకు వేతనాలు జమ అయ్యేవి. గత డిసెంబరు నుంచి హెచ్ఆర్ఎంఎస్ను నిలిపివేశారు. కొత్త పీఆర్సీ అమలును ఏప్రిల్ 1 నుంచి పేరోల్ హెర్బ్ అనే వెబ్ ద్వారా వేతనాలు చెల్లింపులు జరుగుతాయని ఆర్ధిక శాఖ ప్రకటించింది.
అయితే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుండగానే పేరోల్ హెర్బ్ ద్వారా 2022 జనవరి వేతనాలను చెల్లించేశారు. ఫిబ్రవరి వేతనాలు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం చెల్లింపులు చేసేసింది. ప్రస్తుతం ఈ నూతన పేరోల్ హెర్బ్ రిజర్వు బ్యాంకుకు అనుసంధానం కాకపోవటంతో మార్చి వేతన చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో మళ్లీ పాత విధానం హెచ్ఆర్ఎంఎస్ నుంచే వేతన బిల్లులను అప్లోడ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.