విజయవాడలో రోజురోజుకీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో ప్రచారం జరుగుతున్నా బాధితులు మోసపోతూనే ఉన్నారు. నేరగాళ్లు అడిగిన వెంటనే ఏమాత్రం సంశయించకుండా క్రెడిడ్/డెబిట్ వివరాలు చెప్పడంతో పాటు చరవాణికి వచ్చే ఓటీపీనీ చెప్పేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మోసపూరిత ప్రకటనలకు ఆశపడి.. పరిచయం లేని వ్యక్తుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. తీరా డబ్బు పోగొట్టుకున్నాక గానీ తేరుకోవడం లేదు. తక్షణం స్పందించగలిగితే చాలా సందర్భాల్లో ఉపశమనం లభించే అవకాశముంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా పొగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకునే ఆస్కారముంది.
రెండున్నరేళ్లలో రూ.6 కోట్లు.. నగర కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి పలువురు మోసపోతున్నారు. భారీగా సొమ్ము పొగొట్టుకుంటున్నారు. రెండున్నరేళ్లలో ఏకంగా రూ.6 కోట్లు పోగొట్టుకున్నారంటే ఏ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్ఛు ఇప్పటి వరకు అధికారులు రూ.1.71 కోట్లను రికవరీ చేశారు.
సకాలంలో ఫిర్యాదు చేస్తేనే ఊరట
ఎవరైనా ఆన్‌లైన్‌లో వస్తువు కొనుగోలు చేస్తే.. సంబంధిత కొనుగోలుదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఈ కామర్స్ వెబ్‌సైట్ నిర్వాహకులకు చేరేందుకు రెండు రోజులు పడుతుంది. సైబర్ నేర దర్యాప్తు క్రమంలో ఈ సమయాన్నే గోల్డెన్ అవర్స్‌గా పరిగణిస్తారు. వెంటనే ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ప్రతినిధులకు మెయిల్ పంపిస్తారు. తక్షణమే ఆ లావాదేవీని ఆపేందుకు కృషి చేస్తారు. తద్వారా నేరగాళ్ల పాలైన సొమ్మును బాధితుడి ఖాతాకు తిరిగి తెప్పించే వీలుంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏటా ఇలా పదుల సంఖ్యలో బాధితులకు ఊరట లభిస్తోంది. సకాలంలో ఫిర్యాదు చేసిన వారిలో 80 శాతం మందికిపైగా సొమ్మును రికవరీ చేస్తున్నారు.