No police support: మహానాడు భారీ బహిరంగ సభకు లక్షాలదీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులకు పోలీసులు కనీస సహకరించలేదు. ఓ చోటైతే తెదేపా కార్యకర్తల వాహనాల టైర్లలో గాలి తీసేసి వారిని ఇబ్బందులకు గురి చేశారు. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబు.. కాన్వాయ్‌కు కూడా సరిగ్గా రూట్ క్లియర్ చేయలేకపోయారు.
చంద్రబాబు బస చేసిన అతిథిగృహం నుంచి మండువవారిపాలెంలోని సభా ప్రాంగణం మధ్య అయిదు కిలోమీటర్ల దూరం కాగా.. ఆ ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగానే సమయం పట్టింది. ఆయన ప్రయాణించే దారి మొత్తం వాహనాలు కిక్కిరిసిపోయాయి. అయినా సరే పోలీసులు దాన్ని క్లియర్ చేయలేదు. చివరికి తెదేపా కార్యకర్తలే రంగంలోకి దిగి.. చంద్రబాబు వాహనశ్రేణికి రూటు క్లియర్ చేస్తూ ముందుకు కదిలేలా చేశారు.
మహానాడులో పాలొనేందుకు శనివారం ఉదయం నుంచే భారీగా ఎత్తున ప్రజలు వాహనాల్లో ఒంగోలుకి తరలివచ్చారు. ఆ విషయం గుర్తించి కూడా రద్దీ ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోలేదు. వాహనాల పార్కింగ్, జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై నెల్లూరు-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మహానాడుకు వచ్చే నాయకులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం ముందుగానే పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. వాటి గురించి ప్రచారం చేశారు.