‘సార్ మా ఆయన లోపల చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి ఎలా ఉందో చెప్పరూ.’ ‘మా అమ్మ ఐసీయూలో ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఆహారం ఏమైనా తీసుకుంటోందా? గాలి పీల్చుకుంటోందా? చూసే అవకాశం ఉందా? లోపలికి ఎప్పుడు పంపిస్తారు? ఎంతసేపైనా వేచి ఉంటా’ అని వైద్యులు, సిబ్బందిని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రుల వద్ద ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్లముందే మృతదేహాలు తరలిపోతుంటే వీరు మరింత ఆందోళన చెందుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైరస్ బాధితురాలు ఒకరు ‘ఆయాసంగా ఉంది.. ఊపిరాడట్లేదు.. ఎవరూ పట్టించుకోవట్లేదు’ అని సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేయడం అక్కడి పరిస్థితులను స్పష్టం చేస్తోంది. గత నెలలో శ్వాస సమస్యతో ఆస్పత్రిలో చేరిన విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన వృద్ధుడు అదే రోజు చనిపోయాడు. కానీ భార్యకు తెలియదు. పది రోజుల తర్వాత పోలీసులు జోక్యం చేసుకోగా ఆయన మరణవార్త తెలిసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగుల వద్దకు ఆప్తులను పంపడంలో ఇబ్బందులున్నా.. వారిని కనీసం సీసీ కెమెరాల ద్వారా చూపిస్తూ ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నాలూ జరగడం లేదు.
ప్రవేశమార్గం వరకే..
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి కరోనా సోకిన వృద్ధులు, చిన్నపిల్లలను విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రవేశమార్గం దగ్గర రోగిని విడిచిపెట్టి.. కుటుంబసభ్యులను బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ఆ తర్వాత రోగి విషయాలేవీ కుటుంబసభ్యులకు తెలియడం లేదు. గత వారం ఓ మధ్య వయస్కురాలు తనకు గాలి ఆడటం లేదని.. వైద్యులకు చెప్పాలని కుమారుడికి ఫోన్ చేసి రోదించింది. మరికొందరి పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ శ్వాస అందకపోయినా, మరే తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినా త్వరగా స్పందించడం లేదన్న ఆవేదన బాధితుల కుటుంబసభ్యుల్లో వ్యక్తమవుతోంది.
తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకోలేకపోతున్నా