HEALTH ALLOWANCE: ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకే పెద్ద కష్టం వచ్చింది. దుమ్ము, ధూళితో నిత్యం పోరాడే వీరి ఆరోగ్య పరిరక్షణకు ఇచ్చే.. హెల్త్ అలవెన్సులు 5 నెలలుగా నిలిచాయి. ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన ప్రయోజనాలు పెండింగులో ఉండటం వల్ల.. వారి అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.
పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా నిలిచిన హెల్త్ అలవెన్సులు పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన హెల్త్ అలవెన్సులు ఐదారు నెలలుగా నిలిచిపోయాయి. జీతాలు సరిపోక.. పెరిగిన ఖర్చులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కార్మికులు..కష్ట కాలంలోనైనా పనికొచ్చే హెల్త్ అలవెన్సులూ నిలిచిపోవడంతో..అష్టకష్టాలు పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామన్న హామీని ప్రభుత్వం తుంగలోతొక్కి... తమను ఆప్కాస్‌లో పడేసిందంటూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్ అలవెన్సులను కూడా ఆపేస్తే..బతికేది ఎలాగంటూ వాపోతున్నారు.
మున్సిపాలిటీల్లో పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రయాజనాలు అందడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని..విశ్రాంత పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోనే.. పదవీ విరమణ పొందిన 400 మంది కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. వీరిలో ఇప్పటికే చాలామంది చనిపోయారని సహచర కార్మికులు చెబుతున్నారు. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సి వస్తోందని..ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం హెల్త్ అలవెన్సులను ఆపడం, హామీలను పక్కనపెట్టడంపై..ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేసే క్లాస్-4 కార్మికులకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పథకాలు కూడా ఆపడం సమంజసం కాదంటున్నారు.
ఇవీ చదవండి: