తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో గోదావరిఖని-మంథని ప్రధాన రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మల్లేపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో అందరిదీ ఒకే మాట ఒకే బాట. వారి సమష్టి కృషి వల్ల నేటికీ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా వారి గ్రామం నుంచి నమోదు కాలేదు. గ్రామానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తూ, ఎక్కడ కూడా మహమ్మారి చొరబాటుకు అవకాశం ఇవ్వలేదు.
మంథని మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతిరోజు అనేక చోట్ల రెండు, మూడు, ఐదు కేసులు నమోదవుతున్నా.. ఈ గ్రామం నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ గ్రామంలో 283 ఇళ్లు, 600 మంది జనాభా, 450 పైచిలుకు ఓటర్లున్నారు. పూర్తిగా వ్యవసాయంపై, పశువులపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు.
ఒక్కరు మాత్రమే బయటకు..
ఈ గ్రామంలో ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్లరు. అత్యవసరమైతే ఒక్కరు మాత్రమే వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి, శానిటైజేషన్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్తారు. కొత్త వ్యక్తులెవరినీ గ్రామంలోకి రానీయకుండా ఏర్పాట్లు చేసుకుని ప్రజలందరూ బాధ్యతగా ఉంటున్నారు. ప్రతిరోజు మురికి కాలువలు తీయడం, బ్లీచింగ్ చల్లడం, రోడ్లను శుభ్రపరచడం, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటంపై నిబంధనలను కచ్చితంగా ఈ గ్రామంలో అమలు చేస్తున్నారు.
90శాతం వ్యాక్సినేషన్ పూర్తి
కరోనా మహమ్మారిపై పాలకవర్గం సభ్యులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రతి ఇంట్లో చేసుకునే పనుల్లో కూడా మాస్కు ధరించి ఇతరులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఇంటి ముందు ప్రత్యేకంగా ఆవు పేడతో కళ్లాపి చల్లుకుంటామని ప్రజలు తెలియజేశారు. ఈ గ్రామంలో ఇప్పటికే 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం వల్ల కరోనా వైరస్ తమ గ్రామాన్ని తాక లేదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!