ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ కమిషనరేట్​ పరిధిలో ఎగరని పందెం కోడి...

కృష్ణా జిల్లాలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పందెంకోళ్లు యథేచ్ఛగా ఎగిరాయి. నిర్వాహకులు పెద్దయెత్తున బరులు ఏర్పాటు చేయగా.. పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. కానీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు అమలు చేయడంతో.. ఇక్కడ మాత్రం ఆ ఊసే లేదు. నగర పరిసరాల్లో బరులు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న పోలీసులు.. గట్టి నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పందెం రాయుళ్లంతా జిల్లాలోని రూరల్ ప్రాంతాలకు తరలివెళ్లారు.

cock fights in vijayawada commissionerate
విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎగరని పందెం కోడి

By

Published : Jan 13, 2021, 7:34 PM IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా విజయవాడ సహా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు నిర్వహించేవారు. ఈ సారి విభిన్న పరిస్థితి నెలకొంది. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధి మినహా మిగిలిన ప్రాంతాల్లో మాత్రమే పందాలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని పెదపులిపాక, ఈడుపుగల్లు, ఉప్పులూరు, నున్న, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఏటా పెద్దఎత్తున పందాలు జరుగుతుండగా.. ఈ సారి ఎక్కడా ఆ ఊసే లేదు.

కట్టుదిట్టమైన చర్యలతో కట్టడి..

సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు.. పండుగకు వారం రోజుల ముందు నుంచే పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. బరులు ఏటా ఎక్కడ ఏర్పాటు చేసేవారు.. అక్కడి రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. పొలాల్లో ఎట్టి పరిస్ధితుల్లో బరులు ఏర్పాటుకు అనుమతివ్వకుండా చర్యలు చేపట్టారు. నిరంతరం గస్తీ తిరుగుతూ బరులను ఏర్పాటు చేయనివ్వలేదు. ఎక్కడైనా పోలీసుల కన్నుగప్పి ఏర్పాటు చేసినా.. ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈడుపు గల్లు, ఉప్పులూరులో ఏటా వందల ఎకరాల్లో బరులు నిర్వహిస్తుండగా.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దయెత్తున పోలీసులను మొహరించారు. ఈ చర్యల వల్ల విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పందెం కోడి ఎగలేకపోయింది.

రూరల్​లో పందెం కోడి ఎగిరింది...

కృష్ణా జిల్లా రూరల్ పరిధిలో కోళ్ల పందాలు యథేచ్ఛగా జరిపారు. ఊళ్ల శివారు పొలాల్లో పెద్దఎత్తున బరులను ఏర్పాటు చేశారు. బాపుల పాడు మండలం అంపాపురంలో అధికార పార్టీ నేతలు బరులు నిర్వహించగా.. పందెం రాయుళ్లు పెద్దఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు. జిల్లా సహా పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి పందేలను తిలకించారు. వచ్చిన వారికి ఎలాంటి లోటు లేకుండా.. వసతి సహా విందులు, వినోద కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పందాలు లేకపోవడంతో.. అక్కడి వారంతా పెద్ద ఎత్తున అంపాపురం చేరుకున్నారు. వేలాది కార్లు, బైక్​లతో బరుల పరిసరాలు నిండిపోయాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. వీటితో పాటు పలు రకాల క్రీడలు, ఆటలను నిర్వహించగా.. రేపు, ఎల్లుండి పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details