కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న పారిశ్రామిక రంగానికి చేయూత కోసం ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద అదనంగా 20 శాతం ఇవ్వాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. దీని కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. వివిధ కారణాలను చూపుతూ బ్యాంకులు రుణ పరిమితి పెంచటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ ప్రయోజనాలు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలకు అందలేదు. రాష్ట్రంలో 97 వేల ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వాటికి కొల్లేటరల్ సెక్యూరిటీతో సంబంధం లేకుండా 20 శాతం అదనపు రుణాన్ని ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ, బ్యాంకులు అది కచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నాయి.
పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమికి సంబంధించి ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా రుణాన్ని తీసుకున్నారు. కరోనా పరిస్థితుల్లో వాటి రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. ఇలాంటి వాటికీ బ్యాంకర్లు రుణ పరిమితి పెంచటం లేదు. కొద్ది మొత్తంలో పాత బకాయిలు ఉన్నా అడ్డు చెబుతున్నాయి. ఈ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 శాతం ఎంఎస్‌ఎంఈలకు రుణ పరిమితిని బ్యాంకులు పెంచలేదని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు.