FAMILY SUICIDE:విజయవాడలో శనివారం నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు బాధితులు సూసైడ్ లేఖ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫైనాన్స్ సంస్థల వేధింపులే తమ బలవన్మరణానికి కారణమని సూసైడ్ నోట్‌లో వెల్లడించారు. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను లేఖలో పేర్కొన్నారు. వేధింపులకు గురిచేసిన వారి వివరాలను సెల్ఫీ వీడియోను తీసి బంధువులకు పంపించారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు వడ్డీ వ్యాపారులు గుర్తింపు..
కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవతం చేశారు. మృతుల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా వివరాలు సేకరించారు. వేధింపులకు గురిచేసిన నలుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిర్మల్, మరో ఇద్దరు నిజామాబాద్ వడ్డీ వ్యాపారులుగా గుర్తించారు. వ్యాపారుల వేధింపులపై ఆడియో కాల్ రికార్డులు సేకరిస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వారి వివరాలను నిజామాబాద్ పోలీసులకు అందజేశారు.
శవపరీక్షకు మృతదేహాల తరలింపు..
ఆత్మహత్య చేసుకున్న పప్పుల సురేశ్... బంధువులు విజయవాడలోని మార్చురీకి చేరుకున్నారు. మొత్తం నాలుగు మృతదేహాలకు వైద్యులు శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శవపరీక్షలు పూర్తైన తర్వాత మృతదేహాలను బంధువులకు అందజేయనున్నారు.
దుర్గమ్మ దర్శనానికిి వచ్చి..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం విజయవాడలో కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం.. నిన్న ఆత్మహత్య చేసుకుంది. కన్యకాపరమేశ్వరి సత్రంలో నిజమాబాద్ వాసులు తల్లి పప్పుల శ్రీలత(54) , కుమారుడు ఆశిష్(22) అతిగా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి పప్పుల సురేష్(56), మరో కుమారుడు పప్పుల అఖిల్(28) కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతులను తెలంగాణ వాసులుగా గుర్తించారు. ఈనెల 6న నిజామాబాద్ నుంచి విజయవాడ వచ్చిన కుటుంబం.. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్ తీసుకుంది. నిన్న తెల్లవారుజామున 2.30గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువులకు మెసేజ్ పెట్టారు.
బంధువులు స్పందించి సత్రం నిర్వాహకులకు ఫోన్ చేశారు. సత్రం సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా.. తల్లీ కుమారుడు విగతజీవులుగా కనిపించారు. సూసైడ్ చేసుకున్న గదిలో 20 వరకు ఇన్సులిన్ బాటిల్స్, సిరంజీలను పోలీసులు గుర్తించారు.
మెడికల్ షాపుతోపాటు బీఫార్మసీ చదవడంతో మెడిసిన్స్‌పై ఆశిష్‌కు అవగాహన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇన్సులిన్ మితిమీరితే షుగర్ డౌన్ అయి చనిపోతారని పోలీసులు వెల్లడించారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతరం పోలీసులకు సమాచారం అందింది. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు బంధువుకు వారు మెసేజ్ పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:Family suicide at vijayawada : విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!