ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా తనను నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లుగా లేదని.. నిమ్మగడ్డ రమేష్​కుమార్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని కించపరిచే విధంగా ప్రభుత్వం వ్వవహరించడం విచారకరమని అన్నారు. ఎస్​ఈసీగా తన పునర్నియామక ఉత్వర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రమేశ్​కుమార్​ ఓ ప్రకటన విడుదల చేశారు.

నిమ్మగడ్డ
నిమ్మగడ్డ

By

Published : May 31, 2020, 4:56 PM IST

Updated : May 31, 2020, 8:12 PM IST

హైకోర్టు తీర్పు తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియపై రగడ కొనసాగుతూనే ఉంది. కోర్టు తీర్పుననుసరించి తానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ అని నిమ్మగడ్డ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ తన పదవీకాలం ఉందని చెప్పి బాధ్యతలు తీసుకున్నారు. తొలుత ఆయన నియామకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ వెంటనే ఉత్తర్వును ఉపసంహరించుకుంది. నేరుగా బాధ్యతలు స్వీకరించే అధికారం నిమ్మగడ్డకు లేదంటూ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరాం మీడియాకు తెలిపారు. ఈ పరిణామాలపై నిమ్మగడ్డ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఆయన ప్రకటన సారాంశం:

రాష్ట్ట్ర ఎన్నికల కమిషనర్​గా నన్ను తొలగించడంపై నేను వేసిన రిట్ పిటిషన్ ( నెం. 8163) పై హైకోర్టు మే 29న తీర్పిచ్చింది. అందులోని 307వ పేరాలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 10న జారీ చేసిన ఆర్డినెన్స్​తో పాటు.. దానికి అనుగుణంగా జస్టిస్ కనగరాజ్​ను ఎన్నికల కమిషనర్​గా నియమిస్తూ జారీ చేసిన జీవోలను కూడా పక్కన పెట్టింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నా పదవిని పునరుద్ధరించడంతో పాటు.. నా పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే మార్చి 31 వరకూ కొనసాగించాలి అని చెప్పింది. ఎన్నికల కమిషనర్​గా పూర్తి పదవీకాలం కొనసాగే నా హక్కును హైకోర్టు గుర్తించింది. ఈ తీర్పును అనుసరించి.. జస్టిస్ కనగరాజ్ కార్యాలయానికి వచ్చే అవకాశం లేదు. అలాగే ఆయన నియామకం కూడా చెల్లనట్లే. రాష్ట్రంలో ఓ రాజ్యాంగబద్ధమైన పదవి ఎవరూ చేపట్టకుండా ఉండటానికి, అలాగే ఖాళీగా ఉండటానికీ వీల్లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను పదవి నుంచి తొలగించలేదు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్​లోని నిబంధనల వల్ల నేను పదవిలో కొనసాగలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ రద్దు అయిందంటే తిరిగి నేను యథాతథంగా నా పదవిని కొనసాగించవచ్చనే అర్థం. దానికి అనుగుణంగానే నేను తిరిగి నా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం ఇచ్చాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కూడా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు.

కానీ 30వ తేదీన ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశం.. అందులో వారు ఉపయోగించిన భాష, చెబుతున్న కారణాలు, వ్యవహరించిన విధానం చూస్తే.. ఈ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులను ఏమాత్రం గౌరవించే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపించడం లేదు.

దక్షత, స్వతంత్రత కలిగిన రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్​పై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత విచారకరం. రాష్ట్రం తీసుకున్న విధానం.. హైకోర్టు ఉత్తర్వులకు, తీర్పునకు పూర్తి విరుద్ధం.

ఇదీ చదవండి: ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఏజీ

Last Updated : May 31, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details