బంగాళాఖాతంలో ఏర్పడనున్న నివర్ తుపాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం...అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట సహా..మినుము, పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున త్వరితగతిన కోతల్ని ప్రారంభించేలా చూడాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ప్రభుత్వం సూచించింది. పంట కోతల్ని వీలైనంత త్వరగా చేపట్టాల్సిందిగా రైతులకు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు వైద్య బృందాలను కూడా సిద్ధం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంబులెన్సులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచనలిచ్చారు.