NIA Raids: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం నాయకుడు కల్యాణరావు, మావోయిస్టు ఆర్కే భార్య శిరీష ఇంట్లో తనిఖీలు జరిపారు. జిల్లా పోలీసు బలగాల సహాయంతో వారి ఇళ్లను చుట్టుముట్టారు. స్థానికులను, మీడియా ప్రతినిధులను పరిసరాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలతో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డి ప్రభాకర్ ఇంట్లోనూ ఎన్‌ఐఏ ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించింది. అన్యాయాలను ప్రశ్నించిన ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులపై కావాలనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని దొడ్డి ప్రభాకర్ మండిపడ్డారు. అమాయకురాలైన ఆర్కే భార్య శిరీషను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఐఏ సోదాలపై ఆర్కే భార్య శిరీష స్పందించారు. సోదాల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భర్త చనిపోయి బాధపడుతుంటే విచారణ పేరుతో వేధిస్తారా ? అని ప్రశ్నించారు. "అనారోగ్య సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి.. అజ్ఞాతవ్యక్తులు మా ఇంటి వద్ద ఉన్నారంటూ సోదాలు చేస్తున్నారు. నేను ఏం నేరం చేశానని ? నేరం చేసినవాళ్లు రోడ్లపై తిరుగుతుంటే మాత్రం పట్టించుకోరు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు" అని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.