New year Celebrations in AP: కొత్త సంవత్సరం వస్తే అర్ధరాత్రి వరకూ కుర్రకారు కేరింతలతో మార్మోగే రోడ్లు ఈసారి నిర్మానుష్యంగా మారాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదని ముందే పోలీసులు హెచ్చరించడంతో ఎక్కడా అంత సందడి కనిపించలేదు. విశాఖ, విజయవాడతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ రోడ్లపై జోష్ కనిపించలేదు. పోలీసులు అర్ధరాత్రి వరకూ గస్తీ తిరుగూతూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేశారు. శ్రీకాకుళంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లపై రాత్రి సందడి కనిపించలేదు. రాజమహేంద్రవరంలో సమయం దాటిన తర్వాత రోడ్లపై కనిపించినవారికి బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలు చేశారు.
కర్నూలులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొత్తసంవత్సరం వచ్చిందంటే అర్ధరాత్రి వరకూ సంబరాలతో హోరెత్తే రాజ్ విహర్ కూడలి.. నిర్మానుష్యమైంది. డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేశారు. అనంతపురంలో బైకుపై తిరుగుతన్నవారిని పోలీసులు ఆపి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఓ యువకుడి జేబులో మద్యం సీసా కనిపించగా అతనితోనే రోడ్డుపై పారబోయించారు.
ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్న విజయవాడ పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమతమ ఇళ్లలోనే వేడుకలు చేసుకున్నారు. ముందే కేకులు తెచ్చుకుని కొత్త సంవత్సరం ప్రారంభంకాగానే వాటిని ఒకరినొకరు పంచున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు కాంపౌండ్‌వాల్ దాటకుండా సంబరాలు చేసుకున్నారు. చిన్నా, పెద్దా అంతా ఒకచోట చేరి సరదాగా ఆడి పాడారు.