విజయవాడ రైల్వేస్టేషన్ ప్రధాన ప్రవేశమార్గం వద్ద ఉన్న టిక్కెట్ కౌంటర్లను త్వరలో తరలించనున్నారు. రైల్వేస్టేషన్ సెల్లార్‌లో కొత్తగా టిక్కెట్ కౌంటర్లను నిర్మించారు. ప్రధాన ప్రవేశమార్గం వద్ద ఉన్న కౌంటర్లను అక్కడికి మార్చనున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 250 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు లక్ష మందికి పైగా ప్రయాణికులు వచ్చి వెళుతుంటారు. రద్దీ రోజుల్లో రెండు లక్షల మంది వరకు ఉంటారు. రైల్వేస్టేషన్ ప్రధాన మార్గం వద్దే టిక్కెట్ కౌంటర్లు ఉండడంతో.. ప్రయాణికులతో నిత్యం కిక్కిరిసిపోతుంటుంది. ఒకవైపు వచ్చే ప్రయాణికులు, మరోవైపు రైళ్లు దిగి వెళ్లేవాళ్లు, షెడ్యూళ్లను చూసుకునేవాళ్లు అందరూ ప్రధానమార్గం వద్దే కలుస్తుంటారు. ఇలాంటి ప్రదేశంలో ఉన్న కౌంటర్లలో టిక్కెట్లను తీసే ప్రయాణికులు కిక్కిరిసిపోయి వేచి ఉంటారు. రద్దీ వేళల్లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఈ కౌంటర్లను ఇక్కడి నుంచి మరోచోటికి తరలించాలనే ప్రతిపాదనలు చాలాకాలంగా ఉన్నాయి.
కొవిడ్‌కు ముందు కొత్తగా టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల నిర్మాణం చేపట్టారు. ప్రవేశమార్గానికి సమీపంలోనే సెల్లార్‌లో చేపట్టిన నిర్మాణాలు ప్రస్తుతం పూర్తయ్యాయి. అన్ని హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ప్రవేశ మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా.. సాధారణ, రిజర్వేషన్ ప్రయాణికులందరూ ఒకేచోట టిక్కెట్లను తీసుకోనున్నారు. కొత్తగా కట్టిన 16 కౌంటర్లలో.. 10 సాధారణ టిక్కెట్ల కోసం, ఆరు రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం వినియోగించనున్నారు. సెల్లార్‌లో నిర్మించిన ఈ కౌంటర్ల వద్దకు చేరుకునేందుకు రెండు ప్రవేశ, రెండు బయటకు వెళ్లే మార్గాలు ఉన్నాయి. టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులు నేరుగా లోపలి నుంచే ప్లాట్‌ఫాం 01 పైకి చేరుకోవచ్ఛు వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్ట్ మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఎంత ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి వచ్చినా.. ఎలాంటి రద్దీ లేకుండా ఉండేలా విశాలంగా బుకింగ్ కౌంటర్ల ఎదుట ఖాళీ స్థలం ఉంచారు.
కొత్తగా 19 ఏసీ విశ్రాంతి గదులు..