ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టీపీసీసీకి నూతన సారథి.. త్వరలోనే నియామకం

తెలంగాణలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. వారం పదిరోజుల్లో అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ ముఖ్యనాయకుడి మాటల ద్వారా అర్థమవుతోంది. పీసీసీ కుర్చీ కోసం పోటీలో ఉన్న డజను మంది పేర్లను పక్కన పెట్టగా.. గట్టిగా పోటీ పడుతున్న ఇద్దరు ఎంపీల్లో ఒకరిని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

new-pcc-chief-for-telangana-congress
new-pcc-chief-for-telangana-congress

By

Published : Jun 14, 2020, 9:54 AM IST

చాలా కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తు చేసుకున్న డజను మంది నేతలను వడపోసి అనర్హుల పేర్లను ఏఐసీసీ పక్కన పెట్టింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగిన సమయంలో... ఉత్తమ్‌ వర్గీయుడిగా చెప్పుకునే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాహాటంగా వ్యతిరేకించారు. అధ్యక్షుడి విషయంలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మూడు సార్లు లేఖలు..

పార్టీ జండా మోసినవాళ్లకే పీసీసీ పదవి ఇవ్వాలని బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇటీవలే పార్టీ విధేయుల ఫోరం వరుసగా మూడు లేఖలను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాసింది. ఇటీవల సోనియా, రాహుల్‌ గాంధీల వద్ద నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి ఉత్తమ్‌ కుమార్‌ ప్రస్తావించగా.. వారు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ విషయం తమకే వదిలిపెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎంపిక పూర్తయింది.. తర్వలోనే..

రాష్ట్రంలో అధికార పార్టీ... భాజపా పార్టీల స్థితిగతులు, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ఇద్దరు ఎంపీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అటు అధికార పార్టీ, ఇటు భాజపాను ఢీకొట్టే వ్యక్తి, పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగే వ్యక్తికే పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీకి ఎంత ప్రయోజనం.. ఎంత నష్టం అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ స్వయంగా నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే తాను ఆ పదవి నుంచి తప్పుకోనున్నానని వెల్లడించిన తరుణంలో ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డిల్లో ఎవరికో ఒకరికి అవకాశం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో..

అధ్యక్ష పీఠం ఎవరికి వచ్చినా.. సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని... ఆ ఇద్దరు ఎంపీలు ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇతర సీనియర్‌ నాయకులను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సోనియా గాంధీని కుటుంబ సభ్యులతో సహా కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకే పీసీసీ వస్తుందని ధీమాగా ఉన్నారు. వారం పది రోజుల్లో అధ్యక్షుడి మార్పు జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ పెద్దల్లో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

ఇవీ చూడండి:కడప జైలుకు జేసీ ప్రభాకర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details