New Ministers Tour: ప్రమాణ స్వీకారం అనంతరం విజయనగరానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు ఘన స్వాగతం లభించింది. మంత్రి హోదాలో తొలిసారి విజయనగరం చేరుకున్న ఆయనకు జిల్లా పరిషత్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపిక, జేసీ అశోక్ మయూర్, డీఆర్వో గణపతిరావు, డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రఘురాజు, పలువురు శాసనసభ్యలు, కొందరు వైకాపా నేతలు పుష్పగచ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి సతీసమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించకున్నారు.
"మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎంకు, రాష్ట్ర, జిల్లా వైకాపా నేతలకు నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా. అదేవిధంగా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఆ శాఖ మంత్రిగా గిరిజన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాను. ముఖ్యంగా రాష్ట్రంలోని గిరిజనుల విద్య, వైద్య, రహదారుల సమస్యలను తొలి ప్రాధాన్యత అంశాలుగా పరిగణలోకి తీసుకుంటా. గిరిజనాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను పూర్తిస్థాయి సద్వినియోగంపై దృష్టి పెడతా" - రాజన్నదొర, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి
కొవ్వూరులో హోం శాఖ మంత్రి: రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మొట్టమొదటిసారిగా కొవ్వూరు మండలంలో పర్యటించారు. వెదుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయకులతో ముచ్చటించారు. స్థానిక అభిమానులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.