సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత తిరిగి పుంజుకునేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. తప్పులు సరిచేసుకుని పార్టీ బలోపేతం దిశగా వ్యూహరచన చేస్తున్నారు... ఈనెల 9న జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో... ఈ మేర పార్టీ సంస్థాగత నిర్ణయాలు, పదవుల్లో కీలక మార్పులు చేర్పులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 40 శాతం యువతకి పార్టీలో ప్రాధాన్యత కల్పించనున్నారు.
రాజకీయ ప్రత్యర్థులను తట్టుకోవాలంటే అందుకు ధీటుగా పార్టీలో యువ నాయకులను ప్రోత్సహించాలన్నది చంద్రబాబు ఆలోచన. ముందుగా పార్టీ కమిటీల అన్నిట్లోనూ యువ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నారా లోకేష్‌తో పాటు పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేష్, దేవినేని అవినాష్, గాలి భాను, బొజ్జల సుధీర్, దేవినేని చందు, గీతం యూనివర్సిటీ భరత్, చింతకాయల విజయ్ తదితరులు రాజకీయ నాయకుల వారసులుగా ఉన్నారు. వీరిలో అనేక మంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పార్టీలో యువతను మరింతగా ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు.