ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణ ముహూర్తం ఇదే! - ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు

new districts formation in ap
కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

By

Published : Mar 30, 2022, 1:20 PM IST

Updated : Mar 30, 2022, 5:11 PM IST

13:17 March 30

కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం

New districts in AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాలంటీర్ల సేవలకుగానూ ఏప్రిల్‌ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి.. ఆయా కార్యక్రమాలను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. వర్చువల్‌గా భేటీ అయిన మంత్రులు 26 జిల్లాలకు ఆమోదం తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్​లో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎం జగన్​కు సీఎస్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు నివేదించారు. జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి 16 వేల 600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారని సీఎంకు వివరించారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామని స్పష్టం చేశారు. నూతన జిల్లాలకు సంబంధించి వెబ్‌సైట్లు, యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

ఏప్రిల్‌ 4న ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు ప్రభుత్వం మహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్‌ 6న వాలంటీర్లకు సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలని సూచించారు. కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలన్నారు.

కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారుల క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని, పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జీ సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బొగ్గు కొరత లేకుండా చూసుకోండి.. ఏపీ ట్రాన్స్​కోకు సూచన

Last Updated : Mar 30, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details