రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని వీఆర్డీఎల్ (వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ ల్యాబొరేటరీ)ల్లోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి అనుమానితుల నమూనాలు సేకరించి, వాటిని ఈ కేంద్రాలకు తరలించి, ఫలితాలు ప్రకటించే సరికి కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతోంది. దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు మూడో దశ వైరస్ వ్యాప్తి హెచ్చరికల నేపథ్యంలో అదనంగా ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఫలితంగా కొత్తగా 19 ఆర్టీపీసీఆర్ కేంద్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న 14కి అదనంగా వీటిని జిల్లా, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు రూ.1.5 కోట్ల వ్యయం అవుతుంది.
కొత్త వాటిలో రోజుకు 2 వేల నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. హెచ్ఐవీ, క్షయ, డెంగీ, ఇతర వైరస్ పరీక్షలూ చేసేందుకు అవకాశం ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రాష్ట్రంలో పది చోట్ల డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. విశాఖ, చిత్తూరు, విజయవాడలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఆర్టీపీసీఆర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న ఆసుపత్రులు
- అనంతపురం జిల్లాలో డీహెచ్(జిల్లా ఆసుపత్రి) హిందూపురం, ఏహెచ్(ఏరియా ఆసుపత్రి) గుంతకల్లు,
- చిత్తూరు- డీహెచ్ (మదనపల్లె),
- తూర్పుగోదావరి- డీహెచ్(రాజమహేంద్రవరం), ఏహెచ్(అమలాపురం),
- గుంటూరు- డీహెచ్ (తెనాలి), ఏహెచ్ (నరసరావుపేట),
- కడప-డీహెచ్ (ప్రొద్దుటూరు),
- కృష్ణా-డీహెచ్ (మచిలీపట్నం),
- కర్నూలు-డీహెచ్ (నంద్యాల), ఏహెచ్ (ఆదోని),
- నెల్లూరు-ఏహెచ్ (గూడూరు),
- ప్రకాశం-డీహెచ్ (మర్కాపురం), ఏహెచ్ (కందుకూరు),
- శ్రీకాకుళం-డీహెచ్ (టెక్కలి),
- విశాఖపట్నం-డీహెచ్ (అనకాపల్లి), ఏహెచ్(నర్సీపట్నం),
- విజయనగరం-ఏహెచ్ (పార్వతీపురం),
- పశ్చిమగోదావరి జిల్లాలోని ఏహెచ్ (జంగారెడ్డిగూడెం).
196 కొవిడ్ ఆసుపత్రుల డీ-నోటిఫై
వైరస్ కేసులు తగ్గుతున్నందున కొవిడ్ చికిత్స అందించే జాబితా నుంచి 196 ఆసుపత్రులను తప్పించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మలిదశ కేసుల నమోదు సమయంలో 650 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందుబాటులో ఉందని, ఇప్పుడు 454 ఆసుపత్రుల్లోనే ఉందని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల్లో సాధారణ చికిత్స అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.
ఇదీ చదవండి..
రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతోంది: ఏకే సింఘాల్