NEETI THIRUVA in Krishna district: కృష్ణా జిల్లాలో సాగునీటి కాలువల కింద భూములు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నీటితీరువా వసూలు అధికంగానే ఉంటుంది. గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది కూడా జనవరిలో అకాల వర్షాలు కురిశాయి. మరోవైపు తుపానులతో ఖరీఫ్‌లో బాగా నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యం కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. జిల్లాలో పలుచోట్ల పొలంలోనే వరి పంట మొత్తం నేలకొరిగి పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. దీంతో గతేడాది నీటి తీరువా సరిగా వసూలు కాలేదు. కనీసం ప్రభుత్వం రద్దు కూడా చేయలేదు. ఈ ఏడాది రబీ పంటకు సాగునీరు ఇవ్వడం లేదు. అయినా నీటి తీరువాలో రాయితీ మాత్రం ప్రకటించడం లేదు. ప్రస్తుతం రబీకి పంట విరామం ప్రకటించారు. కొన్నిచోట్ల బోర్ల కింద మాత్రమే సాగు చేస్తున్నారు.
రైతులకు నీటి తీరువా తక్కువ మొత్తంలోనే ఉన్నా.. వడ్డీ భారం పెరిగిపోయింది. గత ఏడాది బకాయిపై 6 శాతం వడ్డీ విధిస్తున్నారు. ఈ ఏడాది మార్చి దాటితే 6 శాతం వడ్డీతో కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ బాధ్యతలను ఆయా గ్రామాల్లోని సచివాలయల సిబ్బందికి అప్పగించారు. వీరు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. నెలాఖరులోగా 190 కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతంలో ఎప్పుడూ నీటి తీరువా బకాయిలపై వడ్డీ భారం మోపిన సందర్భాలు లేవని సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దారుణంగా ఆరు శాతం వడ్డీ వేస్తోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలేక, కనీస మద్ధతు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే వడ్డీ వసూలు చేయడంపై ధ్వజమెత్తారు.