జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-2021) ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం విభాగం కఠినంగా వచ్చింది. ఎక్కువ ప్రశ్నలు విశ్లేషణ, సమస్యలతో కూడినవి కావడంతో ఎక్కువ సమయం పట్టింది. ఎక్కువ నిడివి ఉన్న ప్రశ్నలు విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టాయి. రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయి. ఈ రెండు విభాగాలతో పోలిస్తే జీవశాస్త్రం ప్రశ్నలు సులువుగా ఉండటంతో కొంత ఊరట దక్కింది. నిడివి ఎక్కువ ఉన్న ప్రశ్నలను అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం పట్టింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ప్రశ్నపత్రం ఈ సారి కొంత క్లిష్టంగా ఉన్నట్లు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా ‘నీట్-2021’ జరిగింది. రాష్ట్రంలో పది పట్టణాల్లో 151 కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరిగింది.
తొలిసారి ఛాయిస్ విధానం
నీట్ ప్రశ్నపత్రంలో తొలిసారిగా ఛాయిస్ విధానం అమలు చేశారు. 200 ప్రశ్నలు ఇవ్వగా.. అందులో 180 కి సమాధానమివ్వాలి. ప్రతి సబ్జెక్టులో 5 ప్రశ్నలు ఛాయిస్ కింద ఇచ్చారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష జరిగింది. రుణాత్మక (నెగెటివ్) మార్కుల విధానం ఉంది. ప్రశ్నల సంఖ్య పెంచడంతో విద్యార్థులకు సమయం సరిపోలేదని నిపుణులు తెలిపారు.
ఎక్కువ సమస్యాత్మక ప్రశ్నలు
నీట్ ప్రశ్నపత్ర సరళిపై విద్యారంగ నిపుణులు వి.నరేంద్రబాబు, జీవీ రావు, మద్దినేని మురళీకృష్ణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. భౌతికశాస్త్రం ప్రశ్నలు ఎక్కువ సంక్లిష్టంగా వచ్చాయని తెలిపారు. ‘ఫిజిక్స్‌లో 50 ప్రశ్నలివ్వగా.. 42 సమస్యలతో కూడినవి ఉన్నాయి. అందులోనూ 60% ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. 6 ప్రశ్నలు థియరీ విధానంలో ఇచ్చారు. దాదాపుగా ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే వచ్చాయి. ముందుగా జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలిస్తే సమయం మిగులుతుంది. ఫిజిక్స్‌తో ప్రారంభిస్తే దానికే ఎక్కువ సమయం పడుతుంది’ అని వివరించారు.
కొంచెం తీపి.. కొంచెం చేదు
రసాయన శాస్త్రం ప్రశ్నలు సులువుగా ఉన్నా సమాధానాలివ్వడానికి ఇబ్బందిపడ్డారని నిపుణులు చెప్పారు. ‘వృక్షశాస్త్రంలో ఎక్కువ నిడివితో కూడిన ప్రశ్నలు సులువుగా ఉన్నా త్వరగా సమాధానాలివ్వలేరు. జీవశాస్త్రం విభాగంలో జతపరచడం (మ్యాచింగ్)పై ఇచ్చిన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. సమయపాలనపై పట్టున్న వారికే ఈసారి ఎక్కువ అవకాశం. ప్రశ్నపత్రం క్లిష్టంగా ఉండటంతో కటాఫ్ మార్కులు తగ్గిపోయే అవకాశాలున్నాయి’ అని అన్నారు.
ఆభరణాలు తొలగించాకే అనుమతి