విశాఖపట్టణంలో...
విశాఖలో రైల్వే అధికారుల నివాసాల వద్దనున్న కాళీ మాత ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది.. దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉద్యోగుల కుటుంబాలు, సమీప కుటుంబాలు.. పశ్చిమ బెంగాల్ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా బురుజు పేటలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని 108 స్వర్ణ పుష్పాలతో అలంకరించారు. రంగురంగుల పూల దండలు నడుమ.. స్వర్ణ కవచంతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో మాధవి పూర్ణాహుతిలో పాల్గొనగా.. పండితులు ఆశీర్వచనం చేసి నవరాత్రి ఉత్సవాలు ముగించారు.
కర్నూలులో...
కర్నూలు జిల్లా నంద్యాలలో దసరా సందర్భంగా శ్రీ కాళికాంబ అమ్మవారు, బ్రహ్మానందీశ్వర ఆలయ ఉత్సవ మూర్తులు, అమ్మవారిశాల వాసవి కన్యకపరమేశ్వరి దేవి ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం జరిగింది. ఎస్బీఐ కాలనికి చెందిన ఆంజనేయులు.. 200కు పైగా దేవతలు, రథాల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశాడు. వాటి ప్రాముఖ్యత, ప్రాధ్యాన్యతపై అవగాహన కల్పించాడు.
కడపలో...
కడపలోని విజయదుర్గా దేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో అమ్మవారు.. విజయదుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఊరేగింపుగా ప్రాంగణంలోని జమ్మి వృక్షం వద్దకు తీసుకెళ్లి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. గాంధీ బజార్లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. విజయ దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పాత రాయచోటిలోని శ్రీ చాముండేశ్వరి ఆలయం, కె.రామపురంలోని చౌడేశ్వరి దేవి ఆలయం, ఎస్ఎన్ కాలనీలోని శివాలయాలలో విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణాలో...
కృష్ణా జిల్లా మైలవరం కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శనిపూజలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. విచిత్ర వేష ధారణలతో ఊరేగింపు నిర్వహించారు. నూజివీడు సంస్థాన ఆచారం మేరకు మాజీ మంత్రి ఎం.ఆర్ అప్పారావు కుమారుడు మెహర్ అప్పారావు.. శ్రీకృష్ణ ఆలయం నందు దేవతామూర్తులకు, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా బుట్ట బొమ్మలు, శక్తి వేషం, పులి వేషం, దేవతామూర్తుల వేషధారణలు, ధవళ ఐరావతం వంటి ప్రదర్శనలు కోలాహలంగా నిర్వహించేవారు. కరోనా కారణంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించలేకపోయామని ఆయన తెలిపారు.
చిత్తూరులో...
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీమూలస్థాన ఎల్లమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీ దుర్గ అలంకరణలో అమ్మవారు పూల రథంపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్తోపాటు అష్టలక్ష్మీదేవతలు, నాగదేవత, నవగ్రహ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు పీతాంబరాలతో శోభాయమానంగా అలంకరించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని వేశాలమ్మ ఆలయంలో హోమాన్ని నిర్వహించారు. అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.