రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు.. ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞానికి పండితులు శ్రీకారం చుట్టారు. ఏటా విజయదశమి పురస్కరించుకుని యజ్ఞహోమం చేయడం ఆనవాయితీ. అనంతపురం జిల్లా గుంతకల్లు, పామిడి పరిధిలోని ఆలయాల్లో... వాసవీమాతను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళల భక్తి కీర్తనలు, కోలాటాలు, గజ్జల సవ్వడి అలరించాయి.
అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం శ్రీశైలంతోపాటు, మహానంది, కడప విజయదుర్గదేవి ఆలయంలో... భక్తులకు అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనం ఇచ్చారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానానికి... భక్తులు పోటెత్తారు. ప్రకాశం జిల్లా పొదిలిలో కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో.. అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఒమ్మంగిలో సుమారు 150 మంది భవానీలతో పాటు... 200 వందల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.