పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంతనాయక్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందిస్తున్న ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు గురించి చర్చించారు. మూడు రోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నట్లు వివరించారు.
ఇతరుల జోక్యం వద్దు...
గిరిజనుల నుంచి 203 ఫిర్యాదులు కమిషన్‌కు అందాయని... వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని అనంత నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారని, ఈ కాలనీల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలని ఆయన సూచించారు. గిరిజనులకు కేటాయించిన భూముల్లో వారు మాత్రమే సాగు చేసుకునేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి సహాయం అందాలని, ఈ అంశంపై ఇతరులు జోక్యం చేసుకోరాదన్నారు.