దిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన 19 మంది సభ్యుల బృందం అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్)ను సందర్శించింది. ఆర్టిజీఎస్ పనితీరును బృందం పరిశీలించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆర్టీజీఎస్ పనితీరును వారికి వివరించారు. తుఫాన్లు, వరదలు తదితర విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న వ్యవస్థ గురించి తెలిపారు. స్పందన ఫిర్యాదులు పరిష్కారం విధానంలో ఏ విధంగా పరిష్కరిస్తున్నది, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న వివరాలను వారికి తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గల 14,700 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్ కమాండ్ కేంద్రంతో అనుసంధానించామన్నారు. డేటా ఎనలటిక్స్ ఈ కేంద్రం ప్రధాన విధి అని పేర్కొన్నారు. మూడు షిప్టుల్లో ఇక్కడ కాల్ సెంటర్ పనిచేస్తోందని బృందానికి వివరించారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా సుమారు 500 వరకూ పౌర సేవలను ప్రజలకు అందిస్తున్నట్టు వివరించారు. ఆయా సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఎస్ డిఫెన్స్ బృందానికి తెలిపారు. ఈ బృందంలో భారత రక్షణ దళాలకు చెందిన అధికారులతో పాటు నేపాల్, కజకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రతినిధులు ఉన్నారు.