NCW on Madav Video Issue: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సభాపతికి లేఖ రాశారు. మహిళ అనుమతి లేకుండానే మాధవ్ అసభ్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. వీడియో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉందని తెలిపారు. మాధవ్ వీడియో ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఏపీ డీజీపీకి కూడా ఆమె లేఖ రాశారు. పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఖదూర్‌సాహిబ్ లోక్‌సభ సభ్యుడు (పంజాబ్) జస్బీర్ సింగ్ గిల్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు.
'ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోండి'.. లోక్‌సభ స్పీకర్, ఏపీ డీజీపీకి ఎన్సీడబ్య్లూ లేఖలు
NCW on Madav Video Issue: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియోపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంలో తమకు ఫిర్యాదు అందిందన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ.. ఎంపీపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని తెలిపారు. ఈ విషయంలో ఎంపీపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాశారు. అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా లేఖ రాశారు.
ఎంపీ మాధవ్ వీడియో చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె తెలిపారు. ఆ వీడియో బయటకు వచ్చిన రోజు పార్లమెంట్ చరిత్రలోనే ఓ చీకటి రోజు అని పేర్కొన్నారు. నిస్సహాయురాలైన ఓ మహిళను ఎంపీ లైంగిక వేధింపులకు గురి చేశారనేది ఆ వీడియో ద్వారా స్పష్టమైందన్నారు. ఎంపీ ప్రవర్తన అసభ్యంగా ఉందని తెలిపారు. అటువంటి వ్యక్తి పార్లమెంట్‌లో ఉండడాన్ని దేశ ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోను ఒక్క రోజులోనే నాలుగు కోట్ల మంది వీక్షించారని వెల్లడించారు. ఎంపీ ప్రవర్తన పార్లమెంట్ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎంపీలపై ప్రజలకు ఉన్న విశ్వాసం పోకుండా చూసేందుకు మాధవ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి