తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వీధికుక్కలను సామూహికంగా చంపినందుకు ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌ను పురపాలకశాఖ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా మెదక్ జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌ను నియమించారు. నివేదికను 15 రోజుల్లోగా ఇవ్వాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశించారు.
ఇదీ జరిగింది...
వీధి కుక్కల(Street Dogs were Killed)కు పురపాలక సిబ్బంది విషమిచ్చి చంపారనే ఫిర్యాదుతో వాటి కళేబరాలను వెలికితీసిన ఉదంతం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. దసరా నాడు పట్టణంలో ఆరుగురిపై ఓ పిచ్చికుక్క దాడిచేసి గాయపర్చింది. అనంతరం స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పురపాలిక పాలకవర్గ సమావేశం నిర్వహించి సిబ్బందితో వీధికుక్కలను పట్టించారు. వాటిలో 200లకు పైగా కుక్కలకు విషమిచ్చి చంపారని(Street Dogs were Killed), పురపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సహాయ మేనేజర్లు గౌతమ్, శివనారాయణ, జంతు ప్రేమికుడు పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.