ఏటా డీఏస్సీ నోటిఫికేషన్, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్‌పై నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి ముందుంటానని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవరకూ.. ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడదామని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. వైకాపా రెండేళ్ల పాలనలో.. 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరానికి చెందిన నాగేంద్రప్రసాద్.. బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడటంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందని.. లోకేశ్ ప్రశ్నించారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేసిలా నిరుద్యోగులు ఆత్మహత్యలు మానుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.