రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని పత్రికలో వచ్చిన వార్తను సామాజిక మాధ్యమంలో షేర్ చేసినందుకు.. దొండపాటి విజయ్ అనే ఎస్సీ యువకుడిని అరెస్ట్ చేయడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ధాన్యం ఎప్పుడు కొంటారని యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం నేరమా అంటూ ప్రశ్నించారు.
యువకుడిపై కేసు పెట్టడానికి ఇదే ఆధారమైతే.. వైకాపాలో 31 కేసులున్న జగన్ నుంచి బూతులు మాట్లాడే మంత్రుల వరకూ, మార్పింగ్ పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఇంఛార్జ్ ఏ2 రెడ్డి నుంచి పేటీఎం బ్యాచ్ వరకూ మొత్తం జైళ్లలోనే ఉండాలని అన్నారు. చట్టంలోని నిబంధనలు అతిక్రమించి పోలీసులు ప్రవర్తించడాన్ని తప్పుపట్టారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించవలసిన పోలీసులు.. వైకాపా నాయకుల ప్రాపకం కోసం అక్రమ అరెస్టులు చేస్తున్నారని.. వారు ఖాకీ డ్రెస్సులేసుకున్న వైకాపా నాయకులంటూ లోకేశ్ ట్విట్టర్లో మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.