దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనినేని ప్రభాకర్‌ను అరెస్టు చేయటం అప్రజాస్వామికమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాను ఓటమి భయం వెంటాడుతున్నందునే.. చింతమనేనిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తెదేపా నేతల అక్రమ అరెస్టులు సీఎం జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శనమన్నారు.
బి.సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యటం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు. వైకాపా యూనిఫాం వేసుకొని వారు చెప్పినట్లు నడుచుకుంటున్న కొందరు పోలీసు అధికారులు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.