రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్‌లూమ్ బోర్డును రద్దు చేసిందని.. ఈ బోర్డుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారని నారా లోకేశ్ అన్నారు. ఈ బోర్డులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి, సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేదని తెలిపారు. చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యమన్నారు. నిరుద్యోగాన్ని తగ్గించి చేనేతను ఒక సమర్థవంతమైన వృత్తిగా మార్చడంలో ఈ బోర్డులు ఎంతగానో కృషి చేశాయని వివరించారు.