కొవిడ్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నందున పదో తరగతి విద్యార్థులను పాస్ చేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్కు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు.
'గత ఏడాది రాష్ట్రంలో 5 వేల కరోనా కేసులు ఉన్నప్పుడే 10 పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయకుండా రద్దు చేయండి. హైకోర్టు ఆదేశాలు, ప్రతిపక్ష నాయకుల ఆందోళనలకు తావివ్వకుండా మానవత్వంతో వ్యవహరించి రద్దు నిర్ణయం ప్రకటించండి.' అని కోరారు.