"అక్రమ మద్యానికి బ్రాండ్ అంబాసిడరైన సీఎం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి.. యువకులు బలైపోతున్నారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఎక్సైజ్ పోలీసుల వేధింపులు తట్టుకోలేకs గుంటూరు జిల్లా భట్రుపాలెంలో అలీషా ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆ ఘటన మరవకముందే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసుల పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక చేనేత వర్గానికి చెందిన యువకుడు మజ్జి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
"రెండు బాటిళ్లను పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినందుకే ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన పోలీసులు.. మద్యనిషేధం మాటున 25 వేల కోట్ల అక్రమ మద్యం దందా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి ఏం శిక్ష వేస్తారో చెప్పాలి" అని ప్రశ్నించారు. ఇద్దరి యువకుల ఆత్మహత్యకు పోలీసులే కారణమని.. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆ కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన రెండు వీడియోలను తన ట్వీట్ కు జత చేశారు.