Nara Lokesh: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం వైకాపా దండుపాలెం గ్యాంగ్‌ను తప్పించే ఎత్తుగడేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తమ కుమార్తెను హత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపించినా... పోస్ట్‌మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారని ఆయన మండిపడ్డారు. నిన్నటి ఆత్మహత్య నేటి రేప్‌గా ఎలా మారిందో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఫార్మసీ విద్యార్థిని కేసు.. నిందితుడు అరెస్ట్:శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకు కు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్‌ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్‌ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్‌తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.