తెదేపా బలపర్చిన అభ్యర్ధిని వెతకడానికి వెళ్లిన పార్టీ నాయకుడు కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేయటం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అభ్యర్ధిని దాచారనే సమాచారంతో పోలీసుల సమక్షంలో పరిశీలనకు వెళ్లిన కొల్లు రవీంద్రపై.. మరోసారి తప్పుడు కేసు నమోదు చేశారంటూ తీవ్రంగా ఖండించారు. పొట్లపాలెం సర్పంచి అభ్యర్ధి అదృశ్యంపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించిన ఆయన జగన్ పాలన పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా ఉంటుందని మండిపడ్డారు.
రాజకీయ ఒత్తిడికి పోలీసులు తలొగ్గి తప్పుడు కేసులు పెట్టడం హేయమని విమర్శించారు. అధికార పార్టీకి పోలీసులు దాసోహమయ్యారనటానికిని ఈ తప్పుడు కేసులే నిదర్శనమన్నారు. బలహీన వర్గాలు బతకకూడదనేలా తప్పుడు కేసులు పెడుతున్నారని.. పోలీసులు పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.