సైనికుల కోసం... విద్యార్థుల వినూత్న యత్నం! విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు విజయవాడ నలంద డిగ్రీ కళాశాలలో క్రియేటివ్ హార్ట్స్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు విభిన్న రకాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని ఒక మంచి పనితో ప్రారంభించాలని భావించిన విద్యార్థులు... సైనికులకు తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్ ద్వారా వారు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి విక్రయించనున్నారు. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైనిక సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని భావించారు. విద్యార్థుల ఆలోచనకు కళాశాల ప్రిన్సిపల్ ప్రోత్సాహమూ లభించటంతో తమ ఆలోచనలకు పదును పెట్టారు. రంగు కాగితాలతో పూలు, పుష్పగుచ్చాలు, సంచులు... ఉన్నితో అలంకరణ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్, పెయింటింగ్ పాట్, గ్రీటింగ్ కార్డులు వంటి అందమైన వస్తువులను తయారు చేశారు. అలాగే ఇంట్లో ఉన్న పాత దుప్పట్లు, చీరలతో వెయ్యి బ్యాగులు తయారు చేసి వాటికి మెరుగులు దిద్దారు. ఈనెల 27న వీటిని ప్రదర్శనలో ఉంచనున్నారు.