Nagarjuna sagar gates lifted: నాగార్జున సాగర్‌లో వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో వెళుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306 టీఎంసీలకు చేరింది.
తెరుచుకున్న సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు
By
Published : Aug 12, 2022, 4:28 AM IST
|
Updated : Aug 12, 2022, 2:54 PM IST
Nagarjuna sagar gates opened: నాగార్జునసాగర్ 26 గేట్లూ బార్లా తెరుచుకున్నాయి. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి తక్కువ సమయంలో అన్ని గేట్లు తెరిచింది అరుదేనని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. జలాశయం పూర్తి స్థాయి మట్టం 590 అడుగులకు గాను 589.50 అడుగులకు చేరాక గేట్లు ఎత్తాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించారు. ఈ స్థాయికి రావడానికి కొంత సమయం పడుతుందని అనుకోగా ఎగువ నుంచి ప్రవాహం పెరిగింది. బుధవారం అర్ధరాత్రికి 587 అడుగులను దాటింది. దీంతో గురువారం ఉదయం 5.30 గంటలకు 8 గేట్లను 5 అడుగుల చొప్పున ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అనంతరం గేట్ల సంఖ్యను పదికి పెంచారు. పది అడుగుల చొప్పున ఎత్తి 1.60 లక్షల క్యూసెక్కులు వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు 16.. మరో అరగంటలో 20 గేట్లకు పెంచారు. ఒంటిగంట సమాయానికి ప్రాజెక్టుకున్న 26 గేట్లనూ 10 అడుగుల చొప్పున ఎత్తారు. దీంతో సాగర్ స్పిల్‌వే నుంచి కృష్ణమ్మ దూకుతూ దిగువకు వెళ్తోంది.
585 వద్ద నీటి మట్టం కొనసాగింపు..:ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో సాగర్ గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం జలాశయ మట్టాన్ని 585 అడుగుల వద్ద కొనసాగించనున్నారు. శ్రీశైలం నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో గేట్లను ఇదేరీతిలో కొనసాగించే అవకాశాలున్నట్లు డ్యాం బాధ్యతలు చూస్తున్న డీఈఈ పరమేశం ‘ఈనాడు’కు వివరించారు. శ్రీశైలానికి 4.53 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 4.31లక్షలు దిగువకు వదులుతున్నారు.
గోదావరి వరదలతో రాకపోకలకు అడ్డంకి:భద్రాచలం గోదావరికి వరద తాకిడి ఆగడం లేదు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టం హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిదానంగా పెరుగుతూనే ఉంది. గురువారం ఉదయం 6గంటలకు 51.5 అడుగులుండగా సాయంత్రం 6 గంటలకు 52.4 అడుగులకు చేరింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వస్తుంది. కరకట్టపై రాకపోకలను నిషేధించారు. బ్యాక్ వాటర్‌తో వరదపోటు తలెత్తకుండా విస్తా కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక మోటార్లను ఏర్పాటు చేసి వరదనీటిని పైపుల గుండా తిరిగి గోదావరిలో కలుపుతున్నారు. భద్రాచలం-దుమ్ముగూడెం మధ్యలో తూరుబాక వద్ద ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ మార్గంలో ఏపీ-తెలంగాణల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు- ఏలూరు జిల్లా కుక్కునూరు మండలాల మధ్య రవాణా స్తంభించింది. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే దారిలో పలుచోట్ల రహదారులు మునిగాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు వెళ్లే వాహనాలను ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఆపారు.
ఉప్పొంగిన ప్రాణహిత.. ఆందోళనలో ప్రజలు: ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలోని వార్ధ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు చంద్రాపూర్ జిల్లాలోని ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటికి భారీ వర్షాలు తోడై ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. దీంతో పరివాహకంలోని కుమురం భీం జిల్లాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టివద్ద కనీవిని ఎరగని రీతిలో గురువారం రాత్రి ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ వద్ద ఆలయ ప్రాంగణంలో వరద నీరు చేరింది. ఇదే మండలంలోని తాటిపెల్లి వద్ద పెన్‌గంగ ఒడ్డుదాటి చేలలోకి చేరగా ముంపుగ్రామాల ప్రజలు ఆందోళనచెందుతున్నారు.