సినీ పరిశ్రమను, పవన్‌ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని సినీనటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్‌సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకు పవన్‌పై కక్ష కట్టిందన్నారు. ఆ కారణంతోనే సినిమా టికెట్ ధరలపై జీవో విడుదల చేయటం లేదని అన్నారు. జీవో విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఉండేది ఐదేళ్లే అనే విషయాన్ని వైకాపా గుర్తించాలని హితవు పలికారు.
పవన్‌పై పగబట్టి ఇలా చేస్తున్నా.. ఎవరూ మాట్లాడటం లేదని, సినిమా పెద్దలు పవన్‌కు మద్దతు ఇవ్వకపోవటం దురదృష్టకరని వ్యాఖ్యానించారు. ఇది తప్పు అని చెప్పేందుకు ఎందుకు ధైర్యం చాలడం లేదని సినీ పెద్దలను నిలదీశారు. అగ్ర హీరోకే ఇలా జరుగుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా తాము సహకరిస్తామని తెలిపారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటామని నాగబాబు అన్నారు.