నాడు - నేడు పథకంలో భాగంగా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రామాణిక విధానాన్ని అనుసరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో మునుపటి స్థితి, నాడు-నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన అనంతరం తీసిన ఫొటోలను ప్రదర్శించాల్సిందిగా సూచనలు ఇచ్చింది. భౌతికంగా వచ్చిన మార్పులను ప్రదర్శించేలా ఫొటోలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దీనికోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక - పట్టణాభివృద్ధిశాఖ, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, లైట్లు వంటి వాటిని తనిఖీ చేయటంతో పాటు మరమ్మతులు చేసే అంశంలో విద్యార్థుల తల్లితండ్రుల కమిటీలతో కలిసి పనిచేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఎప్పటికప్పుడు సంబంధిత శానిటరీ ఉపకరణాలను కూడా ముందస్తుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించింది. ప్రామాణిక నిర్వహణ విధానం అమలును స్పష్టంగా ప్రదర్శించాలని..వీటి నిర్వహణా బాధ్యతను సంబంధిత ఉన్నతాధికారి తీసుకోవాలని వెల్లడించింది. నాడు-నేడు పథకంలో నిర్దేశించిన 9 అంశాలు రాష్ట్రంలోని పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల స్వరూపాన్ని మారుస్తాయని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ , ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింప చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.