Godavari Floods: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన బాధితుల్లో కనీస భరోసా నింపలేకపోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ పర్యటన ఏదో డ్రామా కంపెనీ కార్యక్రమం జరిగినట్లు అనిపించిందని ఎద్దేవా చేశారు. వైకాపా సానుభూతిపరులను కొంతమందిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి ముందు నిలబెట్టి ప్రభుత్వ సాయం అద్భుతం, చాలా గొప్పగా ఆదుకున్నారని వాళ్లతో చెప్పించారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పని తీరు తెలుసుకోవాలంటే నిజమైన బాధితులను పిలుపించుకొని మాట్లాడాలని సూచించారు. గోదావరి వరదల వల్ల ఆరు జిల్లాలు.. 54 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సామాన్యులు, రైతులు తీవ్రంగా నష్టపోయారని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా పశుగ్రాసం లేక పశువులు ఆకలితో అలమటిస్తే.. ప్రభుత్వం చేసిన సాయం చూసి నోరు లేని పశువులు కూడా ఆనందిస్తాయని ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ పర్యటన వారిలో భరోసా నింపలేకపోయింది: నాదెండ్ల - నాదెండ్ల తాజా వార్తలు
Nadendla on CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితుల్లో భరోసా నింపలేకపోయిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ముందుగా ఎంపిక చేసిన వారితోనే ముఖ్యమంత్రి మాట్లాడారని.. వేరే వాళ్ల నుంచి కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో సీఎం ఉన్నారన్నారు. వరద బాధితులకు ఏం సాయం చేశారో చెప్పకుండా విపక్షాలను విమర్శించటానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఆరోపించారు.
క్షేత్రస్థాయిలో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమైపోయిందని నాదెండ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతమందికి ఆర్థిక సాయం అందింది, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారన్న విషయాలను ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కష్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సాయంపై జనసేన పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించాలని ప్రయత్నిస్తే.. వాళ్లను బలవంతంగా హౌస్ అరెస్టులు చేశారని ధ్వజమెత్తారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేసిన వీర మహిళలను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ పరిహారం అందిస్తుంటే.. ఇక్కడ మాత్రం రూ.2 వేలు ఇవ్వటం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షాల నుంచి వినతిపత్రం కూడా తీసుకోలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి