Nadendla On Jagan Govt: వైకాపా ప్రభుత్వ విధానాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అవినీతి, అక్రమ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే.. రెండో స్థానం నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నా.. ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదని ఆక్షేపించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. 10వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేశారన్నారు. గుంటూరు జిల్లాలో మెుక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
వాన్పిక్ పేరుతో అధికార పార్టీ నేతలు 15 వేల ఎకరాలు దోచుకున్నారని నాదెండ్ల ఆరోపించారు. రోడ్ల కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.13,700 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు.