దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు రైతులు తమ సాగు పద్ధతులు మార్చుకొని కొత్త ధృక్పథంతో ముందుకు సాగాలని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. విజయవాడలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. రైతులు సంఘటితమై సమీకృత విధానాలు అనుసరిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. చాలా దేశాలు ఈ తరహా విధానాలను అనుసరించి సత్ఫలితాలు సాధించాయని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో సాగు విస్తీర్ణం పెరగపోయినా..,జనాభా గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా..వ్యవసాయం రంగం పూర్తి స్థాయిలో పని చేసిందన్నారు.
రైతులు తమ పంట అవసరాలు తీర్చుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకుల నుంచి పరపతి పొందాలని ఆయన సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాబార్డు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరత ఎంతో ఉందని..,వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాగుదారులు ఈ పద్ధతులను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.