ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవమానాలు భరిస్తూ ఉండలేను.. కాంగ్రెస్​కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..'

Komatireddy Rajagopal Reddy: గత కొంతకాలంగా ఉత్కంఠ రేపిన రాజకీయ అంశానికి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డే ముగింపు పలికారు. తాను కాంగ్రెస్​ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు.

komatireddy rajagopal reddy
komatireddy rajagopal reddy

By

Published : Aug 2, 2022, 8:41 PM IST

Munugodu MLA Resign: రాష్ట్రంలో చాలా రోజులుగా నడుస్తోన్న మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ఎపిసోడ్​కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు.

"ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి అనే మాట చెబుతున్నారు. నేను రాజీనామా చేస్తే అక్కడి ప్రజలకు లబ్ధి జరుగుతుందంటే చేద్దామనుకున్నా. కానీ.. రోజురోజుకూ చర్చ పక్కదారి పడుతోంది. గిట్టని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కవ సమయం వేచి చూసేదానికంటే మీ మనసులో ఏమనుకుంటే అలా చేయండి అని మునుగోడు ప్రజలు చెప్పారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావిస్తున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా." -కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

మూడున్నరేళ్లుగా మనుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడుకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కొత్తగా ఇస్తామన్న పింఛన్లు, రేషన్‌ కార్డులు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థికసాయం.. ఇలా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇస్తూ మిగతా పథకాలను రద్దు చేశారని ఆక్షేపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని.. ఏడేళ్లు దాటినా 50శాతం పనులు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం రీడిజైన్‌ చేసి ఆఘమేఘాల మీద నిర్మించారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అని ప్రజలకు అర్థమైందని రాజగోపాల్​రెడ్డి తెలిపారు.

"రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. ఒక ఎస్సీ నేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్‌ సహించలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకొన్నారు. అర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు దళితబంధు పథకం తెచ్చారు. నయా నిజాం మాదిరిగా కేసీఆర్‌ తెలంగాణను పరిపాలిస్తున్నారు. తెరాస ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉంది. కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లపై ప్రజలు అందరినీ నిలదీస్తున్నారు. డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వ్యక్తినైతే 2014 నుంచి ఎన్నో సార్లు తెరాస నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించా. నా పోరాటం కుటుంబ పాలనపై. తెలంగాణలోని 4కోట్ల ప్రజల కోసం.. కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ అంటే చాలా గౌరవం. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్‌ నష్టపోయింది. దేశంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో అరాచక పాలన పోవాలంటే భాజపాతో కలిసి పనిచేయాల్సిన అవసరముంది." -కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details