విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. తూర్పు నియోజకవర్గంలోని డివిజన్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓట్లు అభ్యర్థించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 26 వ డివిజన్‌లో మంత్రి కొడాలినాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు వైకాపాను గెలిపించాలని.... మంత్రి కొడాలి నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత 11వ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ 56వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. 61వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థిని దాసరి ఉదయశ్రీ తరఫున పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం 39 వ డివిజన్‌లో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే డివిజన్‌లో భాజపా అభ్యర్థి బోండా నిరిష్‌కుమార్ వినూత్నంగా కమలం గుర్తుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం విస్తృత ప్రచారం నిర్వహించింది.
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. వార్డుల్లో ముఖ్యనేతలతో పాటు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు.... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఆరునెలలకోసారి జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏలూరులో సీపీఐ, తెలుగుదేశం అభ్యర్థుల తరపున సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెలుగుదేశం బాధ్యుడు బడేటి చంటి ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు.