ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేతన బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కార్మికుల ఆందోళన - ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలు తాజా వార్తలు

వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్​ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఐదు నెలలుగా జీతం అందక అవస్థలు పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు.

muncipal woerkers protest in andhra pradesh for salaries
muncipal woerkers protest in andhra pradesh for salaries

By

Published : Dec 21, 2020, 3:34 PM IST

బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులకు పెండింగ్​లో ఉన్న వేతనాలు, హెల్త్ అలవెన్స్​లు చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ విధానం రద్దు చేసి.. కార్మికుల సంతకాలతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ 20వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తారని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.

విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ పార్కులో ఔట్​ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 5 నెలలుగా జీతాలు చెల్లించకుండా జీవీఎంసీ యాజమాన్యం తాత్సారం చేస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం కలెక్టర్​ కార్యాలయం ఎదుట మున్సిపల్​ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఇప్పుడు.. నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కడపలో కార్మికులు విచారం వ్యక్తం చేశారు. జీతాల బకాయిలు చెల్లించకుంటే 23వ తేదీ కడపకు రానున్న సీఎం జగన్​ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

పురపాలికల్లో పనిచేసే ఇంజనీరింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచాలంటూ గుంటూరు కార్పొరేషన్ ఎదుటు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ABOUT THE AUTHOR

...view details