12నగర పాలక, 75 పుర, నగర పంచాయతీల్లో ఎన్నికలు రాష్ట్రంలో 33 పురపాలికలు ఎన్నికలకు దూరం అవుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారైన 104 పురపాలిక సంఘాలు, నగర పంచాయతీల్లో 75చోట్ల మాత్రమే ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. 15 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కోర్టు కేసుల వల్ల నెల్లూరు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరంలో ఎన్నికలు వాయిదా వేసినట్లు వివరించారు. వాయిదా వేసినవాటిని మరో విడతలో నిర్వహిస్తామన్నారు
ప్రలోభ పథకాల నిలిపివేత...
మరోవైపు ఓటర్లను ప్రభావితం చేసే ప్రలోభాలకు గురిచేసే ఏ పథకాన్నైనా.... నిలిపివేస్తామని రమేశ్ కుమార్ స్పష్టంచేశారు. కొత్త పథకాల ప్రకటనపైనా నిషేధం ఉందని తెలిపారు. 13 జిల్లాల ఎన్నికల పరిశీలకులతో సమావేశం నిర్వహించిన ఆయన కోడ్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకోవడం లేదని స్పష్టంచేశారు.
ఎవరి పనిలో వారు నిమగ్నం...
పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌తో పార్టీలు, అధికారులు తమతమ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా... తుని పురపాలిక ఛైర్‌పర్సన్ అభ్యర్థులు ఖరారయ్యారు. వైకాపా సుధారాణిని, తెదేపా నాగదేవిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించాయి. అధికారులు సైతం భద్రతా చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగా వచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి హెచ్చరించారు.
కఠినంగా వ్యవహరిస్తాం...
తిరుపతిలో పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించగా..మద్యం పంపిణీపై కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా చెప్పారు. విజయవాడలో ఎలాంటి ప్రత్యేక దళాలు అవసరంలేకుండా సీసీ కెమెరాల సాయంతో ఎన్నికలు ప్రశాంతంగానిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఇవీ చూడండి-సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం