Pallavi: అటు ప్రసంగాల్లో ఇటు సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది.. మరోవైపు నాట్యంలో అద్భుతంగా రాణించి అంతర్జాతీయ, జాతీయ అవార్డులు సాధించింది. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. ఆర్థికంగా దీనస్థితిలో ఉన్న తనలాంటి వారిని ఆదుకోవాలని కోరుతోంది విజయవాడకు చెందిన కొండా పల్లవి.
Pallavi: విజయవాడకు చెందిన కొండా పల్లవి నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మూడో తరగతి నుంచే తన ఉన్న ప్రతిభను వివిధ వేదికలపై ప్రదర్శించేంది. పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై దీర్ఘంగా ఆలోచేంచే పల్లవి..చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న ఘటనలపై స్పందించింది. వాటిపైన స్వతహాగా విషయాలను సేకరించి, వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలనే అంశాలను చెప్పేంది. పలు ఛానళ్లలో జరిగిన చిన్న పిల్లల కార్యక్రమాలకు కూడా హాజరై ఈ అంశాలపై మాట్లాడేది. ఈ క్రమంలోనే తనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన అమ్మ రమణ కుమారి, పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. కేవలం పబ్లిక్ స్పీచ్ లే కాకుండా కళలపై ఆసక్తి పెంచుకున్న పల్లవి.. కొన్నేళ్ల నుంచి నృత్యం, సంగీతం నేర్చుకుంటోంది.
Pallavi: పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ప్రపంచ రికార్డును పల్లవి నమోదు చేసింది. 60 నిమిషాల్లో... 60 అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఔరా అనిపించింది. ఛాంపియన్ రికార్డ్ లో తన పేరును ఎక్కించింది. ఇవే కాకుండా అబాకస్ లోనూ జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టింది. మెుదట బాలసిరోమణి అవార్డును గెలుచుకున్న పల్లవి..ఆ తర్వాత అనేక పోటీల్లో నెగ్గి అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 62 అవార్డులు, 145 ప్రశంసా పత్రాలు పొందినట్లు తెలిపింది. తన కూతురు స్థాయిలో రాణించటం సంతోషంగా ఉందని ఆమె తల్లి... రమణ కుమారి చెబుతున్నారు. స్వశక్తి మీదనే ఎదగాలని పల్లవి ఎప్పుడు ఆలోచిస్తోందని తెలిపారు. ఐఏఎస్ కావాలన్న ఆమె లక్ష్యం కోసం...ప్రభుత్వం సాయం చేయాలని కోరారు..